
నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం తగదు
నారాయణపేట రూరల్: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పద్మ అన్నారు. మండలంలోని పేరపళ్లలో మంగళవారం భూ నిర్వాసితులతో ఆమె సమావేశమై మాట్లాడారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడం కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తుంటే.. ప్రభుత్వం మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు మొండివైఖరి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులతో బలవంతంగా భూ సేకరణ చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చెన్నయ్య, నాగరాజు, సంతోష్, వెంకటేశ్, నర్సింహ, హనుమంతు, ఆశప్ప, రాములు తదితరులు పాల్గొన్నారు.