
నేతన్న పొదుపు పథకం వర్తింపజేయాలి
నారాయణపేట టౌన్: అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న పొదుపు పథకం వర్తింపజేయాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో నిర్వహించిన చేనేత సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరమగ్గాలు ఉన్న కార్మికులకు నేతన్న త్రిఫ్ట్ ఫండ్ అమలు చేయకుండా చేనేతకు సంబంధం లేని వారికి ఇవ్వడం సరికాదన్నారు. అర్హులైన చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి నర్సింహులు తదితరులు ఉన్నారు.
నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు
బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుండగా దానిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 13లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ చేరిన నాయకుల పంచాయితీ
గద్వాల: నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు హైదరాబాద్‌కు చేరింది. మంగళవారం జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గం నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలిశారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను విస్మరించడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ కమిటీలలో పదవులు అన్ని కూడా ఎమ్మెల్యే వర్గానికి ఇస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలలో బీ–ఫారాలను పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలని, ఇదేవిషయంపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఛలో గాంధీభవన్‌కు పాదయాత్ర చేపట్టాల్సి వస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ శంకర్, డీఆర్ శ్రీధర్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామిగౌడ్, కృష్ణ, డీటీడీసీ నర్సింహులు, ఆనంద్‌గౌడ్, పటేల్ శ్రీనివాసులు, ప్రకాష్, మాభాషా, రాఘవేంద్రరెడ్డిలు ఉన్నారు.

నేతన్న పొదుపు పథకం వర్తింపజేయాలి