
మహిళా సంఘాలు మరింత బలోపేతం
నారాయణపేట: మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారుచేసిన ఉత్పత్తుల విక్రయ ప్రదర్శన ఏర్పాటు చేయగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల జిల్లాస్థాయి ప్రదర్శన ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తిలకించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రతి ఒక్కరికీ వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి
కోస్గి: పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా కొనసాగుతున్న ఇంజినీరింగ్ కళాశాల భవనాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి.. కళాశాలలో కల్పించాల్సిన వసతులు, బోధన సిబ్బంది, ఇతర సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పట్టణ శివారులోని సర్వే నంబర్ 1737లో ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన 10.08 ఎకరాల స్థలంతో పాటు సర్వే నంబర్ 1809, 1811, 1812లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన ఏడెకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం తరగతులు సైతం ప్రారంభం కానున్న నేపథ్యంలో తరగతి గదుల, ల్యాబ్, కంప్యూటర్లు, బాలికల హాస్టల్, ఇతర సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కళాశాలలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, పీఆర్ డీఈ విలోక్, ఆర్‌అండ్‌బీ డీఈ రాములు తదితరులు ఉన్నారు.