
వైద్యులు అందుబాటులో ఉండాలి
ఊట్కూరు: సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ సూచించారు. మంగళవారం పులిమామిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీ పరిధిలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట డా.సాయిబాబా, డా.నరేందర్, సిబ్బంది సురేశ్, ప్రభాకర్ ఉన్నారు.
టెండర్ల ఆహ్వానం
నారాయణపేట: త్వరలో జరిగే సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ, స్టేషనరీ సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ శైలేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండరు దరఖాస్తు ఫారాలు విడివిడిగా ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2గంటల వరకు జెడ్పీ కార్యాలయంలో లభిస్తాయని పేర్కొన్నారు. అనుభవం, అర్హత గల వారు వచ్చే నెల 2వ తేదీలోగా సీల్డ్ కవర్‌లో టెండర్ దాఖలు చేయాలని సూచించారు. 4న టెండర్లు ఓపెన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జెడ్పీ కార్యాలయంలో సంప్రదించాలని సీఈఓ సూచించారు.