
లేబర్ కోడ్‌లతో హక్కులు నిర్వీర్యం
నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తుందని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.హన్మేశ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో నిర్వహించిన టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా.. పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే కార్మికులకు పనిగంటల పెంపు జీఓ 282 జారీ చేసిందన్నారు. కార్మిక సంఘం నిర్మాణం చేసుకునే హక్కును నిర్వీర్యం చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐలో కోత విధించడం ఇలా అనేక రకాలైన నష్టాలను తెచ్చిందన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గానికి కనీస వేతనం రూ. 26వేలకు పెంచాలని, పెన్షన్ రూ. 9వేలు ఇవ్వాలని, పీఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానం రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న టీయూసీఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి బోయిన్‌పల్లి రాము, ఉపాధ్యక్షుడు కె.కాశీనాథ్, బి.నర్సింహ, సహాయ కార్యదర్శి సుశాంత్, నాయకులు పద్మమ్మ, వెంకటయ్య, నారాయణ, సలీం, సాబిర్, రఫియాబేగం ఉన్నారు.