
ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట క్రైం: వివిధ సమస్యలపై పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని డీఎప్పీ నల్లపు లింగయ్య అన్నారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురు ఫిర్యాదుదారుల సమస్యలను డీఎస్పీ నేరుగా తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో అప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ నిర్వహించాలని తెలిపారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పరిష్కార మార్గం చూపాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100ను సంప్రదించాలని డీఎస్పీ సూచించారు.