
రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు
నారాయణపేట: తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూనిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు రెండోరోజైన బుధవారం కొనసాగాయి. మక్తల్ మండల కాచ్వార్, ఎర్నాగన్ పల్లి గ్రామ రైతులు దీక్షలో కూర్చోగా.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు జి వెంకట్రామిరెడ్డి, అధ్యక్షులు మశ్చందర్ మాట్లాడారు. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా బేసిక్ ధర నిర్ణయించి మూడు రేట్లు పెంచి ఇవ్వాలని, దురాశతో ఉద్యమించటం లేదన్నారు. న్యాయమైన పరిహారం కావాలని పోరాటం చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు మొదట రూ.1400 కోట్లుగా నిర్ణయించి ఆ తర్వాత రూ.4500 కు పెంచారని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది కానీ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిస్తున్నా రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడంలో సంకోచిస్తున్నారని అన్నారు. దీక్షల్లో నాయకులు గోపాల్, బాల్‌రాం, రాఘవేందర్‌రెడ్డి, అనంతయ్యగౌడ్, వెంకటేష్, కావలి రాజు పాల్గొన్నారు.