
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
నారాయణపేట: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఐడీఎస్‌పీ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డా.శివబాలాజీ రెడ్డి వైద్యులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం జేడీ మాట్లాడుతూ.. మలేరియా, డెంగీ, డయేరియా, చికున్‌గున్యా వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కె.జయచంద్రమోహన్ మర్యాద పూర్వకంగా కలిసి కార్యక్రమాల నిర్వహణ తీరును తెలియజేశారు. ఆయన వెంట జిల్లా సబ్ యూనిట్ అధికారి అశోక్ కుమార్, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు నరసింహారావు, సూపర్‌వైజర్ తబితారాణి తదితరులు ఉన్నారు.