
భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి
నారాయణపేట: మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, భూ నిర్వాసితుల సంఘం కన్వీనర్ మశ్చేందర్ రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరా భూమి విలువ రూ. 60లక్షల నుంచి రూ. 90లక్షలు ఉండగా.. ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురవుతున్న భూములకు కేవలం రూ. 14లక్షలు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకంలో భూములను కోల్పోతున్న రైతులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్, వికలాంగుల హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.కాశప్ప పాల్గొన్నారు.