నదీతీరంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణా: భీమా నది తీరంలోని రైతులు తమ పొలాలకు నీరు పారించేందుకు నదిలోకి దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, మొసళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం మండలంలోని కుసమర్తిలోని భీమానది పరిసరాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో కలిసి ఎస్పీ పరిశీలించారు. గత శనివారం భీమా నదిలో నీటి పంపును సరిచేయుటకు అందులోకి దిగిన రైతు తిప్పన్నపై మొసలి దాడి చేసి నీటిలోకి ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. నాటి నుంచి గజ ఈతగాళ్లు, పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అతని కోసం నదిలో ఎంత గాలించినా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సైతం నదిలో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడుతూ.. నది పరిసరాల్లో మొసలి తిరుగుతుందని, ఇంకెంత మందిపై దాడి చేస్తుందోనని, అటుగా వెళ్లలేకపోతున్నామని భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో మొసలిని పట్టుకొని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. అలాగే, 15 రోజులపాటు పోలీసు సిబ్బంది నదీ పరిసరాలను పర్యవేక్షిస్తారని, ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మక్తల్ సీఐ రాంలాల్,ఎ స్‌ఐ ఎండీ నవీద్, ఏఎస్‌ఐ సురేంద్రబాబు ఉన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎస్పీ యోగేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో 29 వరకు పరీక్షలు కొనసాగనున్నాయని, ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఎవరూ గుంపులుగా ఉండరాదని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీ, ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు మూసివేయాలని, పరీక్ష కొనసాగే సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎల్‌ఎల్‌బీ పరీక్షలఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సెమిస్టర్–1, 3కి సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. సెమిస్టర్–1లో 74 శాతం ఉత్తీర్ణత కాగా, 3వ సెమిస్టర్‌లో 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పీయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచ్చినట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ పాల్గొన్నారు.
430 మంది గైర్హాజరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో కలిపి 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 4వ సెమిస్టర్‌కు సంబంధించి మొత్తం 8,924 మంది విద్యార్థులకు హాజరుకావాల్సి ఉండగా 8,524 మంది హాజరై 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో సెమిస్టర్–5 బ్యాక్‌లాగ్ పరీక్షలకు సంబంధించి 299 మందికి 266 మంది హాజరయ్యారు.
ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంగా కవిత
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ఆర్‌ఎంగా జె.కవిత నియమితులయ్యారు. ఈమె ప్రస్తు తం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ వర్క్‌షాప్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇక ఖమ్మం డిప్యూటీ ఆర్‌ఎంగా పనిచేస్తూ గత నెలలో ఇక్కడికి బదిలీపై వచ్చిన భవానీప్రసాద్ ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఆర్‌ఎంగా వెళ్లారు.
నదీతీరంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలి


