సాగులో నూతన ఒరవడి
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్‌పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
ఇతర పంటలకే ప్రాధాన్యం..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు అధికంగా వరి, పత్తి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి నాగర్‌కర్నూల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పత్తి పంట సాగు తగ్గించి వరి వైపు రైతులు మొగ్గుచూపారు. మహబూబ్‌నగర్‌లో ఈసారి వరి 10 వేల విస్తీర్ణం పెరగగా.. పత్తి 2 వేల ఎకరాలు తగ్గింది. నాగర్‌కర్నూల్‌లో వరి విస్తీర్ణం ఏకంగా 66 వేల ఎకరాలు పెరిగింది. అలాగే పత్తి విస్తీర్ణం సైతం గతేడాది కన్నా 4 వేలు అధికంగా సాగైంది. నారాయణపేటలో వరి గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో రైతులు అధికంగా సాగుచేశారు. ఇక్కడ అధికంగా 50 వేల ఎకరాల్లో కందిపంట సాగవుతోంది. వనపర్తి జిల్లాలో వరి 8 వేల ఎకరాలు పెరగగా.. పత్తి విస్తీర్ణం 5 వేల ఎకరాలు తగ్గింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈసారి పత్తి సాగు 70 వేల ఎకరాల వరకు తగ్గగా.. వరి పంట విస్తీర్ణం 7 వేల ఎకరాలు తక్కువగా నమోదైంది.
పాలమూరులో వినూత్నపంటల వైపు రైతుల మొగ్గు
పలుచోట్ల ఆయిల్‌పాం, వాణిజ్య తోటల పెంపకం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి
తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం
యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు
యూరియా కోసం పాట్లు..
గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి రైతులను యూరియా కష్టాలు వెంటాడాయి. పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం రోజుల తరబడి పంపిణీ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. తెల్లవారుజామునే పీఏసీఎస్‌ల వద్దకు వచ్చి క్యూలో నిల్చోవడం, రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు చేయడం కనిపించింది. సరిపడా యూరియా తెప్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
సాగులో నూతన ఒరవడి
సాగులో నూతన ఒరవడి


