చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి

Dec 30 2025 9:14 AM | Updated on Dec 30 2025 9:14 AM

చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి

చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి

వాతావరణం

ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగా, సాయంత్రం ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది.

ప్రశ్న: పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపండి? – ముమ్మడి రాములు, పెద్దకడ్మూర్‌

డీఎంహెచ్‌ఓ: చిన్నారుల్లో తీవ్రమైన జ్వరాలు, జలుబు, ముక్కుకారడం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. వ్యాధి ముదిరి న్యుమోనియా బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఎలర్జీలు, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలతో చిన్నారులు అధికంగా బాధపడుతుంటారు. నెలలోపు ఉన్న పసిపిల్లలో హైపోథర్మియా వచ్చే అవకాశం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి శరీరం చల్లబడుతుంది. ఇది చాలా ప్రమాదకరం, కాబట్టి పసిపిల్లల్ని వెచ్చగా ఉంచాల్సిందే. వేడి ఆహార పదార్థాలు ఇవ్వాలి. సాయంత్రం నుంచే వెచ్చని దుస్తులు ధరించాలి. చలి పెరిగే సమయాల్లో బయటకు పంపొద్దు.

ప్రశ్న: వృద్ధులు, గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

– మారుతి, నాగిరెడ్డిపల్లి, నర్వమండలం

డీఎంహెచ్‌ఓ: చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉన్ని వస్త్రాలు ధరించడం, ఆహార నియమాలు, వ్యాయామం, నడక, యోగా చేయాలి. ఆస్తమా ఉన్న రోగులు ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. సొంటి, మిరియాలు, అల్లం, బెల్లంతో కషాయం చేసుకొని తాగితే చలితీవ్రతను తట్టుకోగలుగుతారు.

ప్రశ్న: బీపీ, షుగర్‌, గుండె జబ్బు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.?

– వెంకటేశ్‌, ఉజ్జెలి

డీఎంహెచ్‌ఓ: బీపి, షుగర్‌, గుండె జబ్బు ఉన్నవారు చలి ఎక్కువగా ఉన్న సమయంలో తిరగరాదు. చలి ప్రభావంతో రక్త నాళాలు మూసుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తద్వారా అకస్మత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బీపీ పేషెంట్లకు ఆక్సిజన్‌ అందక హైపర్‌ టెన్షన్‌కు గురవుతారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు రక్తం చలికి చిక్కబడి బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారి తీస్తుంది. వృద్ధులు, గర్భిణులకు ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లోనే ఉన్ని దుస్తులు ధరించి ఉండడం మంచిది. యోగా లేదా తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.

నారాయణపేట: చలికాలం నేపథ్యంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని.. వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని.. స్వీట్స్‌, జంక్‌ఫుడ్‌ తింటే గొంతు నొప్పి, ఇతర అనారోగ్యాలను ఆహ్వానించినట్లేనని.. స్వీయ జాగ్రత్తలే రక్షణగా నిలుస్తాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్‌ అన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో శీతాకాలంలో ఎదురయ్యే సమస్యలు, వ్యాధులపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడే రోగుల సంఖ్య పెరుగుతోందని, సూర్యోదయం తర్వాత యోగా, వ్యాయామం చేయాలని, జనంలోకి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరి ధరించాలని అన్నారు. పూర్తి వివరాలిలా..

ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే వ్యాధులు ధరిచేరవు ?

– మధూసూధన్‌, మాగనూర్‌

డీఎంహెచ్‌ఓ: ఆహారం వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. స్టోరేజ్‌ ఉన్నవి, ఫ్రిడ్జ్‌లో పెట్టినవి, బయట దొరికే చిరుతిండ్లు, జంక్‌పుడ్‌, కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండడమే మంచిది. విధిగా గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. చలికాలంలో చాలామంది నీరు ఎక్కువగా తీసుకోరు. కానీ, నీరు తాగకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సీజనల్‌ పండ్లు, ఆకు కూరలు, రాగులు, సజ్జలు, పీచు పదార్థాలు తినాలి.

ప్రశ్న: ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు ఉన్నాయా..? – నాగేశ్‌, కొత్తపల్లి

డీఎంహెచ్‌ఓ: అన్ని పీహెచ్‌సీలలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. మందుల కొరత లేదు. ప్రభుత్వ ఆస్పత్రులలోనే మెరుగైన వైద్యం అందుతోంది. జ్వరం, జలుబు, ఇతర ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా అతి తీవ్రం కాక ముందే సమీప పీహెచ్‌సీల్లోని వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు మందులు వాడాలి. ప్రస్తుతం గ్రామాల్లో లెప్రసీ సర్వే నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా ప్రజలు జ్వరం, ఇతర వాటితో బాధపడుతున్నట్లు తెలిస్తే అక్కడే వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

ప్రశ్న: శీతాకాలంలో ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏమిటీ?

– బస్వరాజ్‌, తంగిడి

డీఎంహెచ్‌ఓ: జలుబు, చలి జ్వరం, ఆస్తమా, న్యుమోనియా, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే చెవి, ముక్కుతో పాటు శరీరం కప్పి ఉంచేలా ఉన్ని దుస్తులు ధరించాలి. ఉదయం 8 గంటల తర్వాత బయటకు వెళ్లడం, సాయంత్రం 6 గంటలలోపే ఇంటికి చేరడం ఆరోగ్యానికి మేలు.

ప్రశ్న: కాళ్లు.. ఒళ్లునొప్పులు తీవ్రమయ్యాయి. రక్షణ చర్యలు వివరించరూ?

– వెంకటయ్య, ధన్వాడ

డీఎంహెచ్‌ఓ: చలి తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా ఉండడంతో ప్రధానంగా వృద్ధులకు కాళ్లు, ఒళ్లనొప్పులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. వెంటనే వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. సొంత నిర్ణయాలతో మెడికల్‌ షాపుల్లోకి వెళ్లి మందులు కొనుగోలు చేయొద్దు. వ్యాధి ముదిరే ప్రమాదం ఉంది. ఆహార నియమాలను పాటిస్తే ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement