పడమటి అంజన్న హుండీ లెక్కింపు
మక్తల్: మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించగా.. రూ.7.95 లక్షలు వచ్చింది. సోమవారం ఈ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయశాఖ పరిశీలకుడు ఎస్ శ్రీనివాసచారి, ఆలయ వ్యవస్థాపక వంశీయులు ప్రణేశాచారి ఆధ్వర్యంలో చేపట్టారు. మొత్తం రూ.7,98,572 రాగా ఇందులో రూ.92,802 నాణెములు, రూ.70,5770 నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో మారుతి భజాన మండలి సభ్యులు గుంతల వెంకటేష్, , శ్రీనివాసచారి ఈసరి హన్మంతు, అచ్చుతారెడ్డి, మల్లిఖార్జున్‌రావు, సంజీవ్‌కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు
నారాయణపేట: జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టామని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా యూరియా సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగుతుందని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని యూరియా పంపిణీ కేంద్రాలలో ప్రైవేట్ డీలర్స్ దగ్గర అవసరమైనంత స్టాకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాకు యూరియా అవసరం 2,394 మెట్రిక్ టన్నులకు కాగా ఇప్పటికే 3000 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేసినట్లు, ఇంకా వివిధ పంపిణీ కేంద్రాలలో 1009 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌లో 2885 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రైతులకు సౌకర్యవంతంగా, క్రమబద్ధంగా యూరియా పంపిణీ జరిగేలా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు డీలర్ యూరియా పంపిణీ కేంద్రం ముందు తప్పనిసరిగా షామియానా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా చేపడతానని తెలిపారు.
గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ నాగ మణిమాల తెలిపారు. ఈమేరకు సోమవారం ప్రవేశ పరీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతితోపాటు 6 నుంచి 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు 2026 జనవరి 21లోగా ఆన్‌లైన్‌లో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బోనోఫైడ్, ఫొటో, విద్యార్థి సంతకంతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
మున్సి‘పోల్స్’కు సన్నద్ధం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు మున్సి‘పోల్స్’కు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఓటరు జాబితా ముసాయిదాకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 30న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాల వివరాలను తయారు చేయనునున్నారు. జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటరు జాబితాను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 20 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. అయితే జడ్చర్లలో ఇంకా పాలకవర్గం గడువు ముగియలేదు.
టెట్‌కు ఏర్పాట్లు పూర్తి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా జనవరి 2వ తేదీ నుంచి టెట్ నిర్వహణకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్‌లోని ఫాతిమా విద్యాలయ, జేపీఎన్‌సీ ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం మూడు దశల్లో అభ్యర్థులకు సబ్జెక్టుల వారీగా టెట్ నిర్వహించనున్నారు. ఒక్కో దశలో 190 మంది చొప్పన పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 22 రోజుల పాటు జరగనున్న పరీక్షకు 4,009 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. చాలా మందికి హైదాబాద్, రంగారెడ్డి జిల్లాలో కేంద్రాలను కేటాయించారు.


