భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
నారాయణపేట: పెండింగ్‌లో ఉన్న భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అన్ని మండలాల తహసీల్దార్లతో భూ భారతి, ఎస్‌ఐఆర్ సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. దరఖాస్తులకు తమ పరిధిలో పరిష్కారం చూపి ఆర్డీఓ లాగిన్‌కు పంపించాలని, ఆర్డీఓ సైతం తహసీల్దార్లు పంపించిన ఆయా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. జనవరి మొదటి వారంలోపూ దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ రామచందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో శ్రీధర్ పాల్గొన్నారు.
మహిళల రక్షణ మన కర్తవ్యం
మహిళల రక్షణ, మహిళాభివృద్ధి, మహిళా సాధికారత కోసం అందరం కృషి చేద్దామని అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ– జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పోష్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం, 2013 గురించి వివరించారు. డీపీఆర్‌ఓ రషీద్, మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్టులు అనిత, నరసింహ పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీను సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 19 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.


