మహానంది: సర్ 2026 ప్రక్రియలో ప్రతి ఓటరు వివరాలను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి ఓటు పదిలంగా ఉండేలా చూడాలని జిల్లా ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ రమాదేవిలతో కలిసి మంగళవారం గ్రామంలో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి పురోగతి, పెండింగ్ అంశాలు, తదితర విషయాలపై అవగాహన కల్పించారు.
మహానందీశ్వరునికి ప్రత్యేక పూజలు:
మహానందీశ్వరుని సన్నిధిలో ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ పి.ప్రశాంతి మంగళవారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఆమెకు ఆలయ అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ అధికారి వై.మధు, వేదపండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె శ్రీకామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆమెకు స్వామి, అమ్మవార్ల చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందించారు.


