● బైక్‌పై వెళ్తూ ముందు ఉన్న కారును
ఢీకొన్న వైనం
● మానవత్వం చాటుకున్న వెల్దుర్తి
ఎంపీడీఓ, ఈఓఆర్డీ, సచివాలయ సిబ్బంది
కల్లూరు/వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై ఉలిందకొండ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం కె. మార్కాపురానికి చెందిన కురువ మల్లికార్జున తన కుమార్తె మౌనికను వెల్దుర్తి బీసీ బాలికల హాస్టల్‌లో చేర్పించాలనుకున్నా డు. దరఖాస్తు చేసేందుకు గతంలో అదే పాఠశాలలో చదివిన తన అన్న గణేశ్ కుమార్తె మంజుతో కలిసి సోమవారం బైక్‌పై వెల్దుర్తికి బయలుదేరాడు. మార్గమధ్యలో నాయకల్లు బ్రిడ్జి వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారును ప్రమాదవశాత్తూ మల్లికార్జున వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి కింద పడ టంతో బాబాయి, అమ్మాయికి తీవ్ర గాయాలయ్యా యి. అదే సమయంలో విధి నిర్వహణకు కారులో కర్నూలు నుంచి వస్తున్న వెల్దుర్తి ఎంపీడీఓ చంద్రశేఖర్ రెడ్డి, ఈఓఆర్డీ రవికిశోర్, సచివాలయాల సిబ్బంది క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. హైవే పోలీసులతో కలిసి క్షతగాత్రుల ఆచూకీ గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎంపీడీఓ, ఈఓఆర్డీ స్వయంగా క్షతగాత్రులను అంబులెన్స్‌లోకి చేర్చగా, వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


