శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. ఆదివారం సెలవు రోజు పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరుగు తోంది. వేకువజామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూకంపార్ట్‌మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 8వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం
బొమ్మలసత్రం: ప్రతి మనిషి అరగంటపాటు వ్యాయామం, సైక్లింగ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిట్‌నెస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం యుగంధర్‌బాబు ఆధ్వ ర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పోలీస్ అధికారులతో పాటు యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. స్థానిక బొమ్మలసత్రం నుంచి రైతునగర్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వీటిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం, సైక్లింగ్ చేస్తూ ఆరోగ్యంగా జీవించాలన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వ్యాయామం చేయటం అలవాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు సూర్యమౌళి, వేణుగోపాల్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి రావులపాలెంకు చెందిన ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి కుటుంబీకులు ఆదివారం రూ.5 లక్షల విరాళాన్ని ఏఈవో సతీష్‌కు అందజేశారు. ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి రూ.లక్ష, ఎస్.వెంకటరెడ్డి రూ.లక్ష, ఎస్‌వీఆర్ హర్షిణి రూ.లక్ష, ఎస్.వీఎల్ హరిణి రూ.లక్ష, ఎస్.నిహారిక రూ.లక్ష విరాళాన్ని అందించారు. అలాగే ఏలూరుకు చెందిన పెద్ది రవీంద్ర రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలను దేవస్థానం తరఫున అర్చకులు సత్కరించారు.


