పేట్రేగుతున్న ఎర్రమట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

పేట్రేగుతున్న ఎర్రమట్టి మాఫియా

Jun 8 2026 9:47 AM | Updated on Jun 8 2026 9:47 AM

బొల్లవరం చెరువులో ట్రాక్టర్ల జాతరను తలపిస్తున్న మట్టి తరలింపు దృశ్యం

మహానంది: ఎర్రమట్టి మాఫియా పేట్రేగుతోంది. పొలాలు, చెరువులు, డీకేటీ ల్యాండ్లు ఇలా వేటిని వదలడం లేదు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అనుమతుల పేరుతో యథేచ్ఛగా మట్టి ని అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల అనుమతులుండగా, మరికొన్ని చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా అధికారపార్టీ ‘మమ్మల్నెవరూ ఆపేది’ అంటూ అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. బసవాపురం, గాజులపల్లె, తమ్మడపల్లె, బొల్లవరం గ్రామాల్లోని చెరువుల నుంచి మట్టిని జేసీబీ, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా నిత్యం వేలాది ట్రిప్పులు తీసుకెళ్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు. ఎవరికి ముట్టాల్సింది వారికి ముడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపవరం చెరువు సమీపంలోని ఓ పంట పొలం నుంచి రైల్వే లైన్‌ పేరుతో నిత్యం టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని ఇటుకల బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నా అధికారులు ఎవరూ అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. టిప్పర్‌ మట్టి ధర రూ. పది వేలకు పైగా ఉందని, రోజుకు రూ. లక్షల్లో ఆర్జిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు అధిక లోడుతో వెళ్తుండటంతో పొలాల దారి పాడవడంతో పాటు పంటలపై దుమ్ము వాలి రైతులు నష్టపోతున్నారు. అధికారులు వెంటనే అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement