● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ‘యోగాంధ్ర–2026 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం ఉదయం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు నిర్వహించిన యోగా ప్రదర్శనలను పరిశీలించి, విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజులపాటు యోగాంధ్ర కార్యక్రమం కొనసాగుతుందన్నారు. యోగా వ్యాయామం మాత్రమే కాదని, అది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జీవన విధానమన్నారు. యోగా వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి వ్యక్తిలో ఉల్లాసం, ఉత్సాహం, కార్యదీక్ష మెరుగుపడతాయన్నారు. ఆసక్తి గల వారు యోగాంధ్ర పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు జిల్లాలోని ప్రతి మండలంలో యోగా శిక్షణ అందిస్తారన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


