నవచేతనతో చిన్నారుల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

నవచేతనతో చిన్నారుల అభివృద్ధి

Jun 7 2026 9:00 AM | Updated on Jun 7 2026 9:00 AM

నంద్యాల(అర్బన్‌): నవచేతన యాప్‌ ద్వారా 0–6ఏళ్ల వయస్సు గల చిన్నారుల అభివృద్ధిని అంచనా వేయవచ్చని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిణి లీలావతి అన్నారు. స్థానిక నందమూరినగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో నవచేతన, బాల్య అభివృద్ధి స్క్రీనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు ఉండే వెయ్యి రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైనవన్నారు. ఈ దశలో సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, స్పందనాత్మక సంరక్షణ, పిల్లల సమగ్రాభివృద్ధికి అవసరమన్నారు. అర్బన్‌ సీడీపీఓ చంద్రకళ, డాక్టర్‌ కావ్య చందన, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

సంగమేశ్వరంలో తెలంగాణ హైకోర్టు జడ్జి

కొత్తపల్లి: సప్తనది తీరంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి సుద్దాల చలపతిరావు కుటుంబీకులతో కలసి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆలయ సంప్రదాయానుసారంగా స్వాగతం పలికారు. ఆయన గర్భాలయంలోని వేపదారు శివలింగానికి కృష్ణాజలాలతో అభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, ఇతరత్ర ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం ఆలయ పురోహితులు జడ్జికి ఆలయ చరిత్ర, స్థలపురాణం, ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం జడ్జి కృష్ణాతీర అందాలను తిలకించారు. ఆయన వెంట కొత్తపల్లి తహసీల్దార్‌ ఉమారాణి, ఎస్‌ఐ జయశేఖర్‌ తదితరులు ఉన్నారు.

కొత్త బ్యాంకు ఖాతాకు పాన్‌ కార్డు మినహాయింపు

కర్నూలు(అర్బన్‌): ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం ప్రయోజనం పొందేందుకు కొత్తగా ఓపెన్‌ చేసే బ్యాంకు ఖాతాకు పాన్‌కార్డు అవసరం లేదని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు సమీపంలోని యూనియన్‌ బ్యాంకు లేదా కెనరా బ్యాంకులో విద్యార్థి పేరు మీద ఆధార్‌ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నెంబర్‌తో కొత్త ఖాతాను ప్రారంభించవచ్చన్నారు. ఈ ఖాతాను తప్పనిసరిగా ఎన్‌పీసీఐతో అనుసంధానం చేయాలన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 10లోగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,960 మంది అర్హులైన ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు ఎన్‌పీసీఐ లింకు ప్రక్రియ పెండింగ్‌లో ఉందన్నారు. ఆధార్‌కార్డు, ఆధార్‌ అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌తో సమీపంలోని స్వర్ణ గ్రామ /స్వర్ణ వార్డు సచివాయాలను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చన్నారు.

తాగునీటి సమస్యలపరిష్కారానికి సత్వర చర్యలు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనుల్లో వేగాన్ని పెంచి నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు సీహెచ్‌ మనోహర్‌ చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి అవసరాలకు ప్రభుత్వం ఒక్కో జిల్లా రూ.కోటి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందులో మొదటి విడతగా రూ.50 లక్షలతో జిల్లాలోని 19 మండలాల్లో 24 పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇచ్చారన్నారు. ఈ నిధులతో ముఖ్యంగా బోర్ల డీపెనింగ్‌, ఫ్లష్షింగ్‌, పంపు సెట్ల రిపేర్లు, పైప్‌లైన్ల మార్పు, విస్తరణ, లీకేజీలను అరికట్టడం తదితర పనులు చేపడతామన్నారు. అలాగే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల పనులను వేగవంతం చేయాలని ఇప్పటికే ఈఈ, డీఈఈలను ఆదేశించామరు. జిల్లాలో ఎక్కడ నీటి ఎద్దడి తలెత్తినా, వెంటనే అక్కడికి వెళ్లి సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement