
శ్రీగిరిలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం తోలి ఆదివారాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తులను ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్‌సైట్‌లో తెలుసుకోవడంతో పాటు అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
కుందూనది తీర ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
నంద్యాల(న్యూటౌన్): కుందూనది పరి వాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద చేరుతుండటంతో బానకచర్ల, వెలుగోడు, కేసీ కెనాల్, శ్రీశైలం బ్యాక్ వాటర్ విడుదలవుతుందన్నారు. పట్టణంలోని మద్దిలేరువాగు, హరిజనవాడ, బైటిపేట, తెలుగుపేట, ఊడుమాల్పురం వంటి కుందూ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల పట్ల వార్డు సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పరిరక్షించాలన్నారు. మరింత సమాచారం కోసం మున్సిపల్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూం నంబర్ 7702776048ను సంప్రదించాలన్నారు.
ఉప ప్రధానార్చకుడి ఆత్మహత్యపై విచారణ
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పూజన్నస్వామి ఆత్మహత్యపై ఆదివారం రాత్రి శ్రీశైలం ఈఓ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ముందుగా ఆయన పూజన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పూజన్న ఆత్మహత్యపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాలయ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ విజయరాజును, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామిని, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామిలతో పాటు అర్చకులందరినీ పిలిచి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు బీపీ, షూగర్ ఉండడంతో సమాయానికి మందులు తీసుకోక పోవడంతో పూజన్నస్వామి మృతి చెందారన్నారు. దేవాలయంలో పని చేస్తున్న ప్రతి అధికారి ఇచ్చిన సమాచారాన్ని నివేదిక రూపంలో రాష్ట్ర కమిషనర్‌కు పంపిస్తామన్నారు. దేవాలయంలో అర్చకులు వర్గాలుగా విడిపోయారా, పూజల్లో ఏమైనా మార్పులు జరిగాయా, డిప్యూటీ కమిషనర్ ఏమైనా ఇబ్బందులకు గురి చేశాడా అన్న విషయాలపై కూడా విచారణ చేపట్టామన్నారు.

శ్రీగిరిలో భక్తుల సందడి