
ఒక క్రస్ట్ గేటు నుంచి నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం నీలంసంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్‌లో తెరచి ఉంచిన రెండు రేడియల్ క్రస్ట్‌గేట్లలో ఒక దానిని ఆదివారం మూసివేసి ఒక క్రస్ట్ గేటు ద్వారా 26,698 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 198.8120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 882 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు జూరాల, సుంకేసుల నుంచి 1,57,715 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలంకు వచ్చి చేరింది. జలాశయం నుండి దిగువ ప్రాజెక్ట్‌లకు 53,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.917 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.335 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 69,771 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 53,744 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 30,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,401 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.