కుక్కల దాడిలో రెండు దుప్పులు మృతి
ఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామ శివార్లలో ఉన్న వైఎస్సార్ స్మృతివనం వెనక వైపు ఉన్న పొలాల్లో ఊరకుక్కల దాడిలో రెండు దుప్పులు మృత్యువాత పడ్డాయి. వెలుగోడు నార్త్‌బీట్ ఫారెస్ట్‌లైన్ పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావి వద్ద ఉన్న నీటి తొట్టిలో నీరు తాగేందుకు వచ్చిన దుప్పుల మందపై అక్కడ ఉన్న కుక్కల గుంపు దాడికి పాల్పడింది. దుప్పులు అడవిలోకి పారి పోగా రెండు కుక్కల బారిన పడి తీవ్ర గాయాలై మృతి చెందాయి. సమాచారం అందుకున్న వెలుగోడు రేంజ్ అధికారి ఖాన్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుప్పులకు స్థానిక వన్యప్రాణి వైద్యనిపుణులతో పోస్ట్ మార్టం చేసి కళేబరాలను దహనం చేయించారు. నెలలో దుప్పులపై కుక్కలు దాడి చేయడం ఇది రెండో సారి. గత వారంలో ఇదే ప్రదేశంలో మూడు దుప్పులు కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి.
రైలు ఢీకొని
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు శివారులోని ఇ.తాండ్రపాడు గ్రామ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం కర్నూలు రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.సి.మాధవస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బ్లూ కలర్ రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్ టీషర్టు, బూడిద కలర్ లోయర్ ప్యాంటు, ధరించాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9908889696, 9030481295 ఫోన్ చేసి సమాచారమివ్వాలని సీఐ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్
సక్రమంగా అమలు చేయాలి
కర్నూలు (అర్బన్): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాల గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కోరారు. గురువారం రాత్రి స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని ఎంపీపీ హాల్‌లో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం గౌరవ సలహాదారు గోన నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అసోసియేషన్ చైర్మన్ సోమన్న, కో–చైర్మన్ భాస్కర్, కోశాధికారి డాక్టర్ వై.రాజశేఖర్, కన్వీనర్ చంద్రశేఖర్, కో–కన్వీనర్ మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రమంతా పర్యటించి మాలల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించిన గోన నాగరాజును ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతికి రెండు నిముషాలు మౌనం పాటించారు.


