స్వర్ణ రథోత్సవం.. దేదీప్యమానం
శ్రీశైలంటెంపుల్: రుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం దేదీప్యమానంగా నిర్వహించారు. హర..హర.. మహాదేవ, ఓం నమఃశివా య అంటూ శివనామస్మరణ చేస్తూ నీరాజనాలు సమర్పించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వర్ణ రథంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి విశేషపూజలు నిర్వహించారు. ఆలయ మహాద్వారం ముందుభాగం నుంచి నంది మండపం వరకు మాడవీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో కోలాటం, చెక్కభజన.. తదితర జానపద కళారూపాలు అలరించాయి. శ్రీశైల దేవస్థాన సహాయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, పండితులు, అర్చకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


