● ఇప్పటికే ఒక ఆపరేషన్ చేసిన వైద్యులు ● వర్తించని ఎన్‌టీఆర్ వైద్యసేవ ● ఆదుకోవాలంటున్నతల్లిదండ్రులు
కర్నూలు(హాస్పిటల్): ఆ విద్యార్థి ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. కొన్ని పరీక్షలు కూడా రాశాడు. సోమవారం జరగాల్సిన పరీక్ష కోసం పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే కుమారుడిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దాతల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వివరాలు.. పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన వెంకట నాగయ్య, జి.పరిమళలు తమ కుమారుడైన జి. రిషికేష్ చదువు కోసం కర్నూలు నగరంలోని టెలికాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతంలోని ఒక స్కూల్‌లో జి. రిషికేష్,, 10వ తరగతి చదువుతున్నాడు. కర్నూలు నగరంలోని ఒక సెంటర్‌లో ఈ నెల 17వ తేదీ నుంచి పరీక్షలు రాస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి సోమవారం పరీక్షకు సిద్ధం కావాల్సి ఉందని చదువుతున్న పాఠశాలకు వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అక్కడే చదువుకుని ఏడు గంటలకు ఇంటికి వస్తూనే తనకు విపరీతమైన తలనొప్పి వస్తోందని తల్లిదండ్రులకు చెబుతూ అలాగే మంచంపై వాలిపోయాడు. కొద్దిసేపటికి చూసే సరికి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు కుమారున్ని కర్నూలు నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ బాలుని మెదడులో నరం వాచి చిట్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే అదేరోజు రాత్రి ఆపరేషన్ చేసి మెదడులో లీకై న రక్తాన్ని తొలగించారు. త్వరలో మరో ఆపరేషన్‌కు సిద్ధంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. అయినా ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. చికిత్సకు ఎన్‌టీఆర్ వైద్యసేవ వర్తించదని, ఇందుకోసం రూ.10లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పేదలైన తాము అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకురావాలని, దాతలు స్పందించి తన కుమారున్ని ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పదో తరగతి విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్


