నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. నంద్యాల ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల పరీక్షలు ముగియడంతో అధ్యాపకులు పూర్తి స్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు హాజరవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లాకు సుమారుగా 2,01,066 జవాబు పత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఈ నెల 7వ తేదీ నాటికి సంస్కృతం పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. అప్పుడే మూల్యాంకనాన్ని ప్రారంభించినా ఈ నెల 22వ తేదీకి పూర్తిస్థాయిలో పేపర్లు చేరుకోవటంతో శనివారం నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం ఇంగ్లిష్, మ్యాథ్స్, సంస్కృతం, హిందీ, ఫిజికల్స్, తెలుగు, సివిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో కామర్స్, బాటనీ, జువాలజీ, పేపర్లు రానున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 432 మంది అధ్యాపకులు అధికారులకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగా సంస్కృతం 12, తెలుగు–57, ఇంగ్లిష్–86, హిందీ–6, మ్యాథ్స్–84, సివిక్స్–32 చొప్పున బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినార్, ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటుగా ఒక స్కూట్నీజర్ ఉంటారు. అదేవిధంగా ఈ నెలలో మరో మూడు దఫాల్లో మరి కొంతమంది అధ్యాపకులు ఈ మూల్యాంకనంలో పాల్గొననున్నారు.
అధ్యాపకులను స్పాటుకు పంపించాలి
స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాళ్లు రిలీవ్ చేసి పంపించాలి. ఇప్పటికే స్పాట్ పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకూ ఈ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగనుంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న సదుపాయాలు, పేపర్ల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను రెండు మూడు దఫాలుగా హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశాం.
– సునీత, డీఐఈఓ, నంద్యాల
జిల్లాకు చేరుకున్న 2,01,066
జవాబు పత్రాలు
రిపోర్ట్ చేసిన 432 మంది
అధ్యాపకులు
ముమ్మరంగా ఇంటర్ మూల్యాంకనం


