నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలన్నారు. ఉదయం 9.30 గంటల ప్రారంభమయ్యే కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయి లో నిర్వహించే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వెలుగోడు ఎస్‌ఐపై బదిలీ వేటు
వెలుగోడు: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెలుగోడు ఎస్‌ఐ విష్ణు నారాయణపై బదిలీ వేటు పడింది. ఆయనను తిరుపతికి బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వేల్పనూరు – పెసరవాయి పంట పొలాల్లో పేకాట స్థావరంపై దాడి చేసిన సమయంలో రూ. 5 లక్షలు స్వాధీనం కాగా.. రూ. 12 వేలు చూపించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే రెండు నెలల క్రితం స్టేషన్‌కు వచ్చిన గిరిజన సంఘం నాయకుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేయడంతో అక్రమాలు వెలుగు చూడటంతో తిరుపతికి బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
అక్షరం నేర్పకుండానే..
నంద్యాల(న్యూటౌన్): ఉల్లాస్ కార్యక్రమం కింద స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులకు అక్షరం నేర్పించకుండానే పరీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో అక్షర జ్ఞానాన్ని నేర్పించే కార్యక్రమాన్ని వయోజన విద్యకు చెందిన సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేయాలి. కానీ వారు జిల్లా కేంద్రానికి పరిమితమై పర్యవేక్షణ చేయలేకపోవడంతో మెజార్టీ కేంద్రాల్లో అక్షరాలు నేర్చుకోలేదు. కొన్ని కేంద్రాల్లో స్వచ్ఛందంగా పొదుపు సంఘాల్లోని చదువుకున్న వారు అక్షరాలను నేర్పించినా...అది సంతకాల వరకే పరిమితం అయ్యింది. జిల్లాలో 670 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 26,785 మందికి గాను 23,861 మంది హాజరయ్యారు. 2,924 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మెజార్టీ కేంద్రాల్లో డీఆర్ డీఓ గుర్తించిన నిరక్షరాస్య మహిళలు కాకుండా వారి పిల్లలు, అప్పటికే చదువుకున్న వారితో పరీ క్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పరీ క్షలు నిర్వహించకుండానే పరీక్షలు రాసినట్లు సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. పాణ్యంలో ఓ పరీక్ష కేంద్రాన్ని వయోజన విద్య ఉప సంచాలకులు చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు.
పెండింగ్ ప్రాజెక్టుల కోసం పోరాటం ఉద్ధృతం
నంద్యాల(అర్బన్): రాయలసీమ సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆత్మకూరు రవీంద్రనాథ్ అధ్యక్షతన నూనెపల్లె అమ్మవారి శాలలో వైశ్య ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలు, రైతుల ఆకాంక్షలను గౌరవించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గాలేరు నగరి, హంద్రీనీవా, కేఆర్‌ఎండీ ఏర్పాటు, సాగునీటి జలాల గురించి ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సిద్దేశ్వరం అలుగు 9వ వార్షికోత్సవానికి 2 లక్షల మందితో ర్యాలీగా వెళ్లి సీమ రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు వైఎన్‌రెడ్డి, వైశ్య ప్రముఖులు అయ్యపుశెట్టి సుబ్రమణ్యం, శేషయ్య, గెలివి రామకృష్ణ పాల్గొన్నారు.


