ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శనివారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాద ల్లో భాగంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దిగువ అహోబిలం క్షేత్రాల్లోని శ్రీ లక్మీనరసింహస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అహోబిలం మఠం చేరుకుని పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశి కన్ ఆశ్వీరాదం తీసుకున్నారు. అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదశ్వీరచనాలు అందించారు.
రేపటి నుంచి ‘పది’ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 25,542 మంది విద్యార్థులు 130 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. 581 మంది ఓపెన్ స్కూల్ పది విద్యార్థుల కోసం తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కాగా హాల్ టికెట్‌పై నంద్యాల ఎస్‌బీఐ కాలనీలోని నారాయణ స్కూల్ అని తప్పుగా పడిందని, దానిని పద్మా వతినగర్ నారాయణ స్కూల్ చిరునామాగా భావించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఈ మార్పును విద్యార్థులకు తెలియజేయాలన్నారు.
చేపల పెంపకంతో స్వయం ఉపాధి
కర్నూలు(అగ్రికల్చర్): స్వయం ఉపాధిలో రాణించేందుకు చేపల పెంపకం చక్కటి అవకాశమని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ తెలిపారు. శనివారం ఆయన కర్నూలు, సుంకేసుల డ్యామ్, గాజులదిన్నె ప్రాజెక్టుల్లో పర్యటించారు. కర్నూలు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 2024–25 సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. జిల్లా ప్రగతిని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్యామల కమిషనర్‌కు వివరించారు. కర్నూలు పాత బస్టాండు సమీపంలోని చేపల మార్కెట్‌ను తనిఖీ చేశారు. బంగారుపేట లోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రం(ఐఎఫ్‌టీసీ) లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేడు మార్కెట్‌లో చేపలకు విశేషమైన డిమాండ్ ఉందని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పొదుపు మహిళల అను సంధానంతో చేపల ఉత్పత్తిని పెంచడం, వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లుగా పేర్కొన్నారు.
పరీక్షలు ముగిశాయోచ్ !
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షకు 11,660 మందికి గాను 11,346 మంది హాజరు కాగా 314 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన అనంతరం కేంద్రాల వద్ద విద్యార్థులు సందడి చేశారు. చాలా రోజులుగా జిల్లా కేంద్రంలోని అద్దె గదులు, రెసిడెన్షియల్ కళాశాలలు, హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు ఆనందంగా ఇంటికి బయలుదేరారు.
అహోబిలేశుడి సేవలో..