నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 53 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీవీఈవో సునీత తెలిపారు. బుధవారం రెండోసంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 12,285 మందికి గాను 11,932 మంది హాజరు కాగా 353 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పరిచామన్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పుట్టెడు దుఃఖంలో పరీక్ష
ఆళ్లగడ్డ: కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మృతి చెందడంతో ఆ విద్యార్థిని పుట్టెడు దుఃఖమే మిగిలింది. ‘ నాన్న ఇక రారని.. తనను బాగా చూసుకునే వారు ఎవరు’ అని ఏడుస్తూనే ఆ బాలిక పరీక్ష కేంద్రానికి వచ్చారు. ‘బాగా చదువుకోవాలి’ అని తండ్రి చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ పరీక్ష రాశారు. ఈ విషాదకర ఘటన బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ బస్టాండు సమీపంలోని నాగేశ్వరరావు (48) కుమార్తె పద్మావతి.. స్థానిక వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అనారోగ్యంతో నాగేశ్వరావు మంగళవారం రాత్రి మృతి చెందాడు. రాత్రంతా తండ్రి మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైన పద్మావతి బుధవారం ఉదయాన్నే పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. తండ్రిని గుర్తు చేసుకుంటూనే పరీక్షను పూర్తి చేశారు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
సెట్కూరు సీఈఓగా వేణుగోపాల్
కర్నూలు(హాస్పిటల్): జిల్లా యువజన సంక్షేమ శాఖ(సెట్కూరు) సీఈఓగా డాక్టర్ కె.వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన ఇన్‌ఛార్జి సీఈఓగా వ్యవహరిస్తున్న పి.దీప్తి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన గతంలో కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించారు.
ఆదోని కేసులో
పోసాని విడుదల
కర్నూలు: సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో మంగళవారం బెయిల్ వచ్చిన విషయం విదితమే. బుధవారం కోర్టులో జామీను పత్రాలు దాఖలు చేసి విడుదల ఉత్తర్వులు జిల్లా జైలుకు చేరకముందే గుంటూరు నుంచి సీఐడీ పోలీసులు కర్నూలు చేరుకున్నారు. పిటీ వారెంటుపై మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలు జిల్లా జైలు నుంచి పోసానిని తరలించనిట్లు జైలు అధికారులు పోసాని న్యాయవాదులకు తెలిపారు. ఆదోని కేసులో విడుదల ఉత్తర్వులు జైలు అధికారులకు అందించారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు