ఇ– కేవైసీ 80 శాతమే.. | - | Sakshi
Sakshi News home page

ఇ– కేవైసీ 80 శాతమే..

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

లబ్ధిదారులందరూ

ముందుకు రావాలి

నల్లగొండ: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంతోపాటు, అర్హులకే రేషన్‌ అందేలా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇ– కేవైసీ ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తి కాలేదు. ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తున్నప్పటికీ, జిల్లాలో ఇప్పటికీ సుమారు 20 శాతం మంది లబ్ధిదారులు ఈ– కేవైసీకి దూరంగా ఉన్నారు.

జిల్లావ్యాప్తంగా 991 రేషన్‌ షాపులు..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 991 రేషన్‌ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 5,28,303 రేషన్‌ కార్డులు అమల్లో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 80 శాతం మంది మాత్రమే ఈ– కేవైసీ పూర్తి చేసుకోగా.. మిగిలిన 20 శాతం మంది ఇంకా బయోమెట్రిక్‌ నమోదు చేయించుకోవాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులతో ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు

రేషన్‌ పంపిణీలో అక్రమాలు, అనర్హుల పేర్ల కొనసాగింపు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం ఇ– కేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటికీ మరణించిన వ్యక్తుల పేర్లు కొన్ని రేషన్‌ కార్డుల్లో కొనసాగుతుండగా, వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు కూడా తొలగించని సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి లోపాలను సరిదిద్దడంతో పాటు అర్హులైన కుటుంబాలకు మాత్రమే రేషన్‌ అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఈ– కేవైసీ చేయించుకునే విధానం..

రేషన్‌ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు సమీపంలోని చౌక ధరల దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న ఈ –పాస్‌ యంత్రంలో వేలిముద్ర నమోదు చేయగానే ఆధార్‌ వివరాలు ధ్రువీకరించబడతాయి. దీంతో ఈ– కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడు ఇ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలి. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం పదేపదే అవకాశం కల్పిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కూడా నిర్వహిస్తున్నాం. ఇంకా పెండింగ్‌లో ఉన్న 20 శాతం మంది లబ్ధిదారులు వెంటనే తమ సమీప రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి బయోమెట్రిక్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.

– వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ, నల్లగొండ

ఫ బయోమెట్రిక్‌ చేయించుకోని 20 శాతం మంది రేషన్‌ లబ్ధిదారులు

ఫ అలస్యం చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారుల హెచ్చరిక

ఫ జిల్లాలో 5.28 లక్షల కార్డులు ఉండగా పెండింగ్‌లో లక్షకు పైగా లబ్ధిదారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement