నకిరేకల్: మూసీ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ముగిసింది. సొసైటీలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకు గురువారం వరకు 71 నామినేషన్ల దాఖలయ్యాయి. చివరి రోజు 29 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీరామ్ తెలిపారు. 25న నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఏవీకే ఫంక్షన్ హాల్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అదే రోజు 3.30 గంటల తరువాత ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు జలాశయం చుట్టూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557మంది మత్స్యకారులు ఓటర్లుగా నమోదై ఉండగా వీరంతా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.


