నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కె.రాహుల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా పని చేస్తున్న ఆయనకు నల్లగొండ డీఎంహెచ్‌ఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్.. కరోనా సమయంలో నోడల్ అధికారిగా పనిచేశారు. జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాహుల్ తెలిపారు. ఆయనను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌ఓ కలెక్టర్ చంద్రశేఖర్‌ను మర్యాద పుర్వకంగా కలిశారు.
డీఈఈ–సెట్ ఫేజ్–2
కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
నల్లగొండ : డీఈఈ–సెట్–2026 ఫేజ్–2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదలైనట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈ–సెట్‌లో అర్హత సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోని వారికి జూన్ 18న డైట్, నల్లగొండలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫేజ్–1లో సీటు పొంది కళాశాలలో చేరిన అభ్యర్థులకు స్లైడింగ్ ఆప్షన్, ఫేజ్–1లో సీటు పొందని వారు, గతంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు జూన్ 19, 20 తేదీల్లో కొత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 21న వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్)కు అవకాశం కల్పించారని తెలిపారు. మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన జూన్ 25న సీట్లు కేటాయిస్తారని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థులు జూన్ 25 నుంచి 27 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
మూసీ మత్స్య సొసైటీకి
42 నామినేషన్లు
నకిరేకల్ : మూసీ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నకిరేకల్ మండలం వల్లభాపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. సొసైటీలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకుగాను బుధవారం వరకు 42 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి కే.శ్రీరామ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి తేదీ కావడంతో మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రైస్ మిల్లర్ లక్ష్మయ్య అరెస్ట్
రామగిరి (నల్లగొండ) : సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) అవకతవకల కేసులో నల్లగొండ పట్టణానికి చెందిన గౌతమి రైస్ మిల్లు యజమాని కొండా లక్ష్మయ్యను నల్లగొండ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూరల్ ఎస్‌ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, భారీగా అవకతవకలకు పాల్పడినట్లు లక్ష్మయ్యపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడు లక్ష్మయ్యను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో, ప్రస్తుతం జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు. లక్ష్మయ్యపై రామ్‌లక్ష్మణ్ మిల్లులో సీఎంఆర్ ధాన్యం అవకతవకలపై కూడా కేసు ఉంది.


