మిర్యాలగూడ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్‌ఏలు అత్యంత అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన బీఎల్‌ఏల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగి అక్రమ మార్గంలో బీజేపీ గెలిచిందని, బీఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణలో కూడా అదే జరుగుతుందని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని, జూలై 31న వచ్చే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను సరి చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి ఒక్క బీఆర్‌ఎస్ కార్యకర్త వెరిఫికేషన్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మొట్టమొదటగా విజయం సాధించే సీటు మిర్యాలగూడ అని ధీమా వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని, ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా బీఆర్‌ఎస్ పార్టీ కొట్లాడుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, నల్లమోతు సిద్దార్థ, ఇలియాస్‌ఖాన్, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, మోసిన్‌అలీ, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, షహనాజ్‌బేగం, ఎండీ.యూసుఫ్, పాలుట్ల బాబయ్య, షోయబ్, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, హాతీరాం, చిట్టిబాబునాయక్ పాల్గొన్నారు.
ఫ వైటీపీఎస్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి


