ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు యంత్రాంగం సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు యంత్రాంగం సన్నద్ధం

Jun 17 2026 5:21 AM | Updated on Jun 17 2026 5:21 AM

నల్లగొండలోనే తక్కువ మ్యాపింగ్‌

4.02 లక్షల ఓట్లలో తప్పులు

జిల్లాలోని నల్లగొండ నియోజకవర్గంలోనే ఓటర్ల మ్యాపింగ్‌ తక్కువగా (75.01 శాతం) పూర్తయింది. 62,373 మంది ఓటర్లు వివరాలను ఇంకా మ్యాపింగ్‌ చేయలేదు. మిర్యాలగూడలో 77.50 శాతం మ్యాపింగ్‌ పూర్తికాగా, నాగార్జునసాగర్‌లో 95.40 శాతం, నకిరేకల్‌లో 95.04 శాతం, మునుగోడులో 87.90 శాతం, దేవరకొండలో 88.53 శాతం మ్యాపింగ్‌ పూర్తయింది. మ్యాపింగ్‌లో భాగంగా ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించినవి దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 96,725 మంది ఓటర్లు ఇచ్చిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – సర్‌) పక్కాగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పెరిగిన వలసల నేపథ్యంలో ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లను తొలగించే లక్ష్యంతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 2002నాటి, ప్రస్తుత ఓటర్ల జాబితాల ఆధారంగా మ్యాపింగ్‌ ప్రక్రియను చేపట్టింది. ఈనెల 25వ తేదీ నుంచి సర్‌ను క్షేత్రస్థాయిలో ప్రారంభించనుంది. బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు. ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను అందజేసి సంతకాలతో తిరిగి స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియతో ఇప్పటివరకు గ్రామాల్లో, పట్టణాల్లో రెండు చోట్లా ఓటు ఉంటే ఒకచోట తొలగించనున్నారు.

2002 నాటి జాబితాతో మ్యాపింగ్‌

జిల్లాలో బూత్‌ల వారీగా 2002 ఓటర్ల జాబితాను, ప్రస్తుతం ఓటర్ల జాబితాతో పోల్చి ఇప్పటివరకు మ్యాపింగ్‌ చేపట్టారు. జిల్లాలో 86.62 శాతం మ్యాపింగ్‌ పూర్తయింది. మిగతా మ్యాపింగ్‌ ప్రక్రియను కూడా ఈనెల 25వ తేదీలోగానే పూర్తి చేయనున్నారు. పాత జాబితాలో తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యుల వివరాలతో ప్రస్తుతం ఓటర్లను అనుసంధానం చేయనున్నారు.

ప్రతి ఇంటికీ బీఎల్‌ఓ

ఈనెల 25వ తేదీ నుంచి చేపట్టబోయే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను అందజేయనున్నారు. వాటిలో పూర్తి వివరాలు నింపి ఎన్యుమరేషన్‌ ఫామ్‌పై సంతకం చేయాలి. అందులో ఒక ఫామ్‌ను ఓటరు తన వద్ద ఉంచుకుని.. మరో ఫామ్‌ను బీఎల్‌ఓకు అందజేయాలి. ఈ ప్రక్రియపై బీఎల్‌ఓలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 18,012 మంది బీఎల్‌ఓలు శిక్షణ పొందారు. ఇందుకు అవసరమైన కిట్‌ను అందిస్తున్నారు.

అసలైన ఓటర్ల గుర్తింపే లక్ష్యం

సర్‌లో అసలైన ఓటర్లను గుర్తించడమే లక్ష్యంగా ఎన్ని కల సంఘం ఈ చర్యలు చేపట్టింది. ఓటరు భారతీయుడా కాదా, ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్నాయా.. బోగస్‌ ఓట్లు ఏమైనా ఉన్నాయా? మృతి చెందిన వారి ఓట్లు అలాగే ఉన్నాయా? అనే వివరాలను సేకరించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టనున్నారు. 2002 జాబితాలో ఓట్లు లేని వారు, కుటుంబ సభ్యుల వివరాలు లేని వారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ఆధారాల్లో ఏదో ఒకటి త గిన పత్రాలను సమర్పిస్తే వారి ఓటును ఉంచుతారు.

అభ్యంతరాలకు అవకాశం

నెల రోజుల పాటు కొనసాగే సవరణ ప్రక్రియ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఎవరి పేర్లయినా తొలగిస్తే, ఇతర అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని దరఖాస్తుల పరిశీలన తర్వాత అక్టోబరులో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

జిల్లాలో సర్‌ మ్యాపింగ్‌లో 4.02 లక్షల ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 2002 10,92,369 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 15,16,253 మంది ఓటర్లు ఉండగా వారిలో 13,13,325 మంది (86.62 శాతం) ఓటర్ల వివరాలు మ్యాపింగ్‌ అయ్యాయి. ఇంకా 2,02,928 మంది (13.38 శాతం) ఓటర్లు వివరాలను ధ్రువీకరించలేదు. కొన్నిచోట్ల బీఎల్‌ఓలు ఆయా ఓటర్లను సంప్రదించనివి కూడా ఉన్నాయి. ఇక మ్యాపింగ్‌ పూర్తయిన ఓటర్లలో 4,02,517 మంది (30.65 శాతం) వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో ఇంటి పేరు, ఓటరు పేరు, తండ్రి పేరులాంటి వాటిల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు.

ఫ రెండు చోట్లా ఓటుంటే ఒకచోట తొలగింపు

ఫ 86.62 శాతం పూర్తయిన మ్యాపింగ్‌

ఫ మ్యాపింగ్‌ కాని ఓటర్లు 2.02 లక్షల మంది

ఫ 4,02,517 ఓటర్ల వివరాల్లో తప్పులు

ఫ 25 నుంచి క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరించనున్న బీఎల్‌ఓలు

వంద రోజుల్లో సర్‌ ప్రక్రియ ఇలా..

జూన్‌ 25 నుంచి ఇంటింటి గణన

జూలై 31న ముసాయిదా జాబితా ప్రకటన

జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరణ

సెప్టెంబర్‌ 28 వరకు విచారణలు

అక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటన

‘సర్‌’ మ్యాపింగ్‌ వివరాలు ఇలా..

నియోజకవర్గం మొత్తంఓటర్లు మ్యాపింగ్‌ అయినవి కానివి తప్పులున్నవి

దేవరకొండ 2,69,098 2,38,220 30,878 96,725

నాగార్జునసాగర్‌ 2,34,722 2,23,925 10,797 66,840

మిర్యాలగూడ 2,40,574 1,86,443 54,131 58,008

నల్లగొండ 2,49,571 1,87,198 62,373 51,249

మునుగోడు 2,63,757 2,31,839 31,918 59,342

నకిరేకల్‌ 2,58,531 2,45,700 12,831 70,353

మొత్తం 15,16,253 13,13,325 2,02,928 4,02,517

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement