నల్లగొండ : పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు కుటుంబానికి చేయూత పథకం కింద రూ.2 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవడం పోలీస్‌శాఖ బాధ్యత అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం, పెన్షన్, ఇతర సంక్షేమాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.


