నీరు వృథా కాకుండా చూస్తాం
డిండి : వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిండి ప్రాజెకు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే మెయిన్ కెనాలకు ఉన్న 22 డిస్ట్రిబ్యూటర్లలో దాదాపు 10 నుంచి 15 డిస్ట్రిబ్యూటర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ఏటా నీటి విడుదల సమయంలో నీరు వృథాఅయి.. ఆయకట్టు చివరి భూములకు పంట చివరి దశ వరకు నీరందక రైతులు నష్టపోతున్నారు.
ప్రాజెక్టులో 2 టీఎంసీల నీరు..
డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు (2.48 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నిల్వ ఉన్న 2 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలోని ఎడమకాలువ కింద 12,500 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుడి కాలువ కింద 250 ఎకరాల ఆయకట్టు ఉంది. వానాకాలం పంటలకు నీటి విడుదలపై ఇరిగేషన్ శాఖ అధికారుల ఈనెల 8న రైతులతో సమావేశమయ్యారు. ఈనెల 17 లేదా 19వ తేదీన ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని సమావేశంలో రైతులు తీర్మానించారు. కాల్వ డిస్ట్రిబ్యూటర్లకు గడువులోగా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను రైతులు కోరారు. నీటి విడుదల తేదీపై జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నీటి విడుదల సమయంలోనే హడావుడి..
డిండి ప్రాజెక్టు మెయిన్ కెనాల్‌కు 22 డిస్ట్రిబ్యూటర్లలో సగానికి పైగా తుప్పు పట్టి పాడైనా గేట్లకు మరమ్మతు, కెనాల్ లోపలి భాగంలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకపోయిన మట్టిని తొలగించే విషయంలో ఏటా నీటి విడుదల సమయంలో మాత్రమే హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నీటి విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. డిస్ట్రిబ్యూటర్ల మరమ్మతు పనులు పూర్తి కాలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాడైనా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నీరు వృథా కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
బాపన్‌కుంట వద్ద మెయిన్ కెనాల్‌లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు
తుప్పపట్టిన గోనకొల్ శివారులోని డిస్ట్రిబ్యూటర్ తలుపు
డిండి ప్రాజెక్టు మెయిన్ కెనాల్‌కు ఉన్న డిస్ట్రిబ్యూటర్లలో పాడైన వాటికి మరమ్మతులు చేస్తున్నాం. నీరు వృథా కాకుండా చర్యలు చేపడతాం. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని అందిస్తాం.
– హన్మంతురావు, ఇరిగేషన్ డీఈ
ఫ ఆనవాలు కోల్పోయిన డిండి ప్రాజెక్టు మెయిన్‌కెనాల్ డిస్ట్రిబ్యూటర్లు
ఫ నామమాత్రంగా పనులు చేస్తున్న అధికారులు
ఫ తూములు సరిగాలేక 40 శాతం నీరు వృథా


