బ్రహ్మోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

Jun 17 2026 5:21 AM | Updated on Jun 17 2026 5:21 AM

కనగల్‌ : మండలంలోని ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు జూన్‌ 23 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఎండోమెంట్‌ సహాయ కమిషనర్‌ కె.భాస్కర్‌, అర్చకులు నాగోజు మల్లాచారి, గాదె దామోదర్‌రావు, జినుకుంట్ల చంద్రయ్య, కె.ఉపేందర్‌రెడ్డి, ఎన్‌.ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

21న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్‌ పోటీలు

నల్లగొండ టూటౌన్‌ : మేకల అభినవ్‌ 36వ జయంతి పురస్కరించుకొని ఈనెల 21వ తేదీన గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంస్థ సౌజన్యంతో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి చెస్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కొసనం కరుణాకర్‌రెడ్డి, గాంధీగ్లోబల్‌ ఫ్యామిలీ సంస్థ ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని ఇండోర్‌ స్టేడియంలో అండర్‌ – 7, 9, 11, 13, 15, 17 విభాగాల్లో బాల, బాలికలకు స్విస్‌ పద్ధతిలో 5 రౌండ్‌లలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 36 మంది విజేతలకు బహుమతితో పాటు ఫిడే రేటెడ్‌ టోర్నమెంట్‌కు ఎంపిక చేస్తామని తెలిపారు. చెస్‌ పోటీలకు వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పిస్తాని, ఇతర వివరాలకు 9985423823 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

నకిలీ విత్తనాలు విక్రయించొద్దు

చందంపేట : రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌ సూచించారు. మంగళవారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఫెర్టిలైజర్‌ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్‌ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్‌ బుక్కులు, విక్రయ రికార్డులను పరిశీలించారు. రైతులు లైసెన్స్‌ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదు పొందాలని సూచించారు. రైతులు భూమిలో సరిపడా తేమ లేకుండా విత్తనాలు విత్తడం వల్ల మొలకలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుందన్నారు. ఆయన వెంట ఏడీఏ శ్రీలక్ష్మి, ఏఓ యాదగిరి ఉన్నారు.

పశువులకు గొంతువాపు నివారణ టీకాలు

మాడుగులపల్లి : పశువులకు ముందస్తుగా గొంతువాపు నివారణ టీకాలు వేయాలని జిల్లా పశువైద్యాధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జీవీ రమేష్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మాడుగులపల్లి మండలంలోని గండ్రవానిగూడెం గ్రామంలో పశువుల గొంతువాపు నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో పశువులకు వచ్చే జ్వరం, గొంతువాపు నివారణ కోసం ఈ టీకాలు వేస్తామని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతినెలా పశువైద్య సిబ్బంది పర్యటించి గొంతువాపు ముందస్తు టీకాలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వినయ్‌కుమార్‌, సర్పంచ్‌ బొబ్బలి కావ్యశ్రీనివాస్‌, రైతులు మాధవరెడ్డి, సతీష్‌, రవి, నారాయణ, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌, సిబ్బంది రాకేష్‌, రవిచందర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement