మూతబడ్డ పాఠశాలలను తెరిపిస్తాం | - | Sakshi
Sakshi News home page

మూతబడ్డ పాఠశాలలను తెరిపిస్తాం

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

నార్కట్‌పల్లి : జిల్లాలో మూతబడ్డ 314 పాఠశాలలను పునః ప్రారంభిస్తామని.. ఆ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని సమగ్రశిక్షా జిల్లా కోఆర్డినేటర్‌ ఆర్‌.వీరేంద్ర కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన నార్కట్‌పల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ పరిశీలించి మాట్లాడారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న గ్రామాల్లో.. ప్రైవేట్‌ పాఠశాల పంపించే ఉపాధ్యాయులు తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ఆయన వెంట బాజా మురళి, నరసింహ ఉన్నారు.

మేరెడ్డి యాదగిరిరెడ్డికి సాహిత్య పురస్కారం

రామగిరి(నల్లగొండ) : నల్లగొండకు చెందిన సీనియర్‌ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిష్టాత్మక ఆవంచ సీతారామారావు స్మారక సాహిత్య పురస్కారం అందుకున్నారు. నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, దివంగత ఆవంచ సీతారామారావు శత జయంతిని పురస్కరించుకొని ఆయన స్మారకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌ భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని యాదగిరిరెడ్డికి ప్రదానం చేశారు. గడిచిన ఆరు దశాబ్దాలుగా మేరెడ్డి యాదగిరిరెడ్డి సాహిత్య రంగంలో కొనసాగిస్తున్న విశిష్ట సేవలకు, ఆయన రాసిన కథలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ సాహితీవేత్త, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, మోత్కూరు నరహరి తదితర ప్రముఖుల చేతుల మీదుగా యాదగిరిరెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. పురస్కారాన్ని అందుకున్న యాదగిరిరెడ్డికి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు తండు కృష్ణకౌండిన్య, పెరుమాళ్ల ఆనంద్‌, సాగర్ల సత్తయ్య, అలుగుబెల్లి రామచంద్రారెడ్డి, ఓరుగంటి పురుషోత్తం, పున్న అంజయ్య, వల్లాల అచ్చయ్య, పరందాం, శీలం భద్రయ్య తదితరులు అభినందనలు తెలిపారు.

వాహనాల తనిఖీ.. మూడు కేసులు నమోదు

నల్లగొండ : రోడ్డు భద్రతను బలోపేతం చేయడం, మోటారు వాహనాల చట్టం–1988 నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీ చేపట్టారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 130 వాహనాలను పరిశీలించగా, నిబంధనలు ఉల్లంఘించిన మూడు వాహనాలపై కేసులు నమోదు చేశారు. నల్లగొండ జిల్లాలో 40 వాహనాలను తనిఖీ చేసి రెండు కేసులు నమోదు చేయగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 45 వాహనాలను తనిఖీ చేసి ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించలేదు. సూర్యాపేట జిల్లాలో 45 వాహనాలను తనిఖీ చేసి ఒక కేసు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా వాహనాల ఫిట్‌నెస్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, బీమా, పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికెట్‌, పర్మిట్‌ తదితర చట్టబద్ధ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా అధికారి వాణి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement