నల్లగొండ : పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం(ఎఫ్‌ఎల్‌ఎం) కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన నల్లగొండలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, మర్రిగూడెం పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఫౌండేషన్ లిటరసీ, సంఖ్యాశాస్త్ర నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి విద్యార్థి మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. త్వరలోనే విద్యార్థులకు కొత్త యూనిఫాం అందజేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్‌రావు, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, కార్పొరేటర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ చంద్రశేఖర్


