నల్లగొండ టౌన్ : ప్రభుత్వ పాఠశాలల కుదింపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం నల్లగొండలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెంచుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుందన్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని కోరారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే యువజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల ఎరువులు విత్తనాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూరియా అమ్మకం యాప్ ను రద్దు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


