నల్లగొండ : విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి బడులు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులను ఆకర్షించేలా రంగు కాగితాలు, మామిడితోరణాలు, కొబ్బరి మట్టలతో పాఠశాలలను ముస్తాబు చేస్తున్నారు.
తొలిరోజే పుస్తకాల పంపిణీ..
ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవుల్లోనే జిల్లాకు పాఠ్య పుస్తకాలు, నోట్‌పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాంకు రాగా వాటిని ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేర్చారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు తరలించారు. విద్యార్థులు మొదటి రోజు రాగానే తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు నోట్‌బుక్స్, పాఠ్య పుస్తకాలు అందించనున్నారు.
గురుకులాల వైపు మొగ్గు..
ఐదేళ్లుగా జిల్లాలో విద్యార్థుల ఎంపికలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతి తర్వాత గురుకులాల్లో చేరుతున్నారు. ఉచిత వసతి, నాణ్యమైన బోధన, పోటీ పరీక్షల శిక్షణ వంటి సౌకర్యాలు ఉండడంతో గురుకులాల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. టీసీల ఆన్‌లైన్ విధానం అమల్లో ఉండటంతో విద్యార్థుల బదిలీలు సులభంగా సాగుతోంది.
నాణ్యమైన విద్యే ధ్యేయం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు కనీసం 10 శాతం పెంచాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు జూలై 20న ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ ఫలితాల ఆధారంగా బోధనలో అవసరమైన మార్పులు చేసి విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచే చర్యలు తీసుకోనున్నారు.
పాత యూనిఫాంతోనే పాఠశాలలకు...
ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు వస్త్రం రాగా వెంటనే కుట్టించేవారు. పాఠశాలలు ప్రారంభం రోజే నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫాంలు అందించేవారు. అయితే ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చడంతో కొంత ఆలస్యమైంది. ఇప్పటి వరకు ఇంకా జిల్లాకు వస్త్రం రాలేదు. దీంతో విద్యార్థులు గత ఏడాది తీసుకున్న పాత యూనిఫాంలతోనే పాఠశాలలకు రానున్నారు.
పాఠశాలలు,
విద్యార్థుల సంఖ్య ఇలా..
ప్రాథమిక 825
ప్రాథమికోన్నత 120
ఉన్నత 225
కేజీబీవీ 27
మోడల్ స్కూళ్లు 17
అర్బన్ రెసిడెన్షియల్ 1
కేంద్రీయ విద్యాలయాలు 2
ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు 75,000కు పైగా..
ప్రైవేట్ పాఠశాలలు 388
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 30,000కు పైగా..
ఫ నేడు పాఠశాలల పునః ప్రారంభం
ఫ గురుకులాలు, ప్రైవేట్ స్కూళ్లవైపు
విద్యార్థుల మొగ్గు
ఫ ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు


