మిర్యాలగూడ : మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సుబ్బారావు సేవలు ప్రజా ఉద్యమాల చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతి ఎన్‌ఎస్పీ క్యాంప్‌లో నిర్వహించిన సుబ్బారావు సంస్మరణ సభలో ఆయన మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతి, రాష్ట్ర నాయకుడు గోసుల మోహన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. సుబ్బారావు సమాజంలోని సమస్యలను లోతుగా అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. చైతన్య సమాఖ్య ద్వారా సామాజిక చైతన్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లిన ఆయన హక్కులపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. పౌర హక్కుల పరిరక్షణలో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజల తరఫున బలమైన స్వరంగా నిలిచారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సీడీ రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, పొన్నూరు రమేష్, ఉదయ, కిరణ్మయి, సృజన, అజయ్, నీరజ, పాండురంగారావు, రామారావు, రాజు, రంగారావు, కృష్ణయ్య, రామయ్య, విమల, రాధా, జూలూరు గౌరీశంకర్, సజయ, అంబటి వెంకన్న, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి


