తిరుమలగిరి(సాగర్) : వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వానాకాలం సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీని ఫలితంగా భూగర్భజలాల లభ్యత తగ్గడంతో పాటు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. దీంతో వర్షాధార పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రైతులందరూ అప్రమత్తంగా ఉండి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని తిరుమలగిరి(సాగర్) ఏఓ గంట హర్షిత సూచిస్తున్నారు. వానాకాలం పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే..
వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రైతులు దీర్ఘకాలిక వరి రకాల సాగును తగ్గించి స్వల్పకాలిక మరియు సన్న రకాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వల్ల పంటను 20–30 రోజుల ముందుగానే కోయవచ్చు. నీటి వినియోగం తగ్గి వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చు.
ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత..
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కంది, పెసర, మినుము, సజ్జలు, జొన్నలు, నువ్వులు మరియు ఆముదం సాగు చేయాలి. కరువు పరిస్థితులను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.
నేల తేమ సంరక్షణ..
చెరువు మట్టిని పొలంలో తోలడం, పశువుల ఎరువును వేయడం, పొలంలో కలుపు మొక్కలను తొలగించడం, మల్చింగ్ పద్ధతుల ద్వారా నేలలో తేమను నిల్వ ఉండేలా చూడాలి. అంతేకాకుండా వర్షపు నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను వినియోగించడం ద్వారా నీటి పొదుపు మరియు నీటిని వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది.
ఆరుతడి పంటలు మేలు..
బోర్లు, బావుల కింద వరి సాగు చేసే రైతులు సగానికి పైగా వరి విస్తీర్ణాన్ని తగ్గించి ఆరుతడి పంటలైన పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు మరియు నూనెగింజల పంటల విస్తీర్ణానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
నేల సారం, నీటి నిల్వ సామర్ధ్యాన్ని
పెంచే చర్యలు..
● రైతులు తమ పొలాల్లో పశువుల ఎరువు మరియు చెరువుల మట్టిని తోలడం ద్వారా నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి.
● పచ్చిరొట్ట ఎరువుల పంటలైన జనుము, జీలుగ పంటలను సాగు చేసి పుష్పించే దశలో భూమిలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ పదార్ధం పెరుగుతుంది.
● దీని వల్ల వర్షపు నీరు భూమిలోకి సులభంగా ఇంకి భూగర్భజలాల పెరుగుదలకు దోహదపడతాయి.
● నేలలో నీటి నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం పెరిగి పంటలకు ఎక్కువకాలం తేమ అందుబాటులో ఉంటుంది.
● నేల భౌతిక పరిస్థితి మెరుగుపడంతో పాటు నేల సారం పెరిగి పంటల దిగుబడి మెరుగుపతాయి.
● నీటి వినియోగ సామర్ధ్యం, నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం పెరుగుతుంది.
ఎల్‌నినో పరిస్థితుల ప్రభావ
నివారణకు సూచనలు..
వర్షాధార పంటలు సాగు చేసుకునే రైతులు నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన అనంతరం మొత్తం 60–75 మి.మీ. వర్షాపాతం నమోదైన తర్వాతే విత్తనాలు విత్తుకోవాలి.
తక్కువ నీటి అవసరం కలిగిన పంటల సాగును ప్రోత్సహించాలి.
పంటలు ఎదిగే దశలో అవసరమైన మేరకు కచ్చితమైన నీళ్లు అందించాలి.
సిఫారసు చేయబడిన మోతాదులో ఎరువులను వినియోగిస్తూ సమీకృత పోషక నిర్వహణ పద్ధతులను అనుసరించాలి.
కీటక నాశకాల విచక్షణరహిత వినియోగాన్ని నివారించి పర్యావరణ హిత సమగ్ర కీటక నిర్వహణ విధానాలను అమలు చేయాలి.
సాధ్యమైన చోట్ల సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలి.
వానాకాలం సాగుపై తిరుమలగిరి
(సాగర్) ఏఓ హర్షిత సూచనలు


