రిసార్ట్‌లో యువకుడి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

రిసార్ట్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావి గ్రామ శివారులోని ఓ రిసార్ట్‌లో శనివారం అర్ధరాత్రి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నర్సాపూర్‌ మండలంలోని శ్రీరామ్‌పూర్‌ గ్రామానికి చెందిన గాండ్ల రాము(27) హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లిలో నివాసముంటున్నాడు. వీకెండ్‌ కావడంతో రాము పనిచేస్తున్న కంపెనీకి చెందిన 20 మంది స్నేహితులు కలిసి పార్టీ చేసుకునేందుకు గాను చౌటుప్పల్‌ మండలం ఎల్లంబావి గ్రామ పరిధిలోని ఓ రిసార్ట్‌ను బుక్‌ చేసుకున్నారు.

పార్టీ చేసుకున్న

స్నేహితులు..

రాముతో పాటు అతడి స్నేహితులంతా శనివారం సాయంత్రం రిసార్ట్‌కు చేరుకున్నారు. ఆనందంగా కలిసిమెలిసి పార్టీ మొదలుపెట్టారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. కొంతసేపటి తర్వాత అంతా సద్దుమణిగింది. అనంతరం స్నేహితులంతా ఎవరి పనిమీద వారు నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పార్టీకి వచ్చిన నలుగురు స్నేహితులు కలిసి రిసార్ట్‌లోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో స్విమ్మింగ్‌ ఫూల్‌లో నడుచుకుంటూ మిగతావారిని అనుసరించసాగాడు. ఈ క్రమంలో ఆ ఈతరాని యువకుడి కాళ్లకు నీటి అడుగున ఏదో తగిలింది. ఈ విషయాన్ని మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పడంతో వారంతా కలిసి స్విమ్మింగ్‌ పూల్‌ లోపలికి వెళ్లి చూడగా.. రాము కనిపించాడు. వెంటనే అతడిని స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. రిసార్ట్‌ లోపల ఉన్న మిగతా స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారంతా బయటకు వచ్చి రాముకు సీపీఆర్‌ చేశారు. వెంటనే చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రాము మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. చౌటుప్పల్‌ సీఐ మన్మథకుమార్‌, ఎస్‌ఐ యాదగిరిలు ఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. అయితే తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతడిని స్నేహితులే కొట్టి హత్య చేశారని రాము తండ్రి అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.

ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేశారని మృతుడి తండ్రి ఫిర్యాదు

హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు

చౌటుప్పల్‌ మండలం

ఎల్లంబావి శివారులో ఘటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement