దొంగ ఓట్లను తొలగించేందుకే ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్లను తొలగించేందుకే ‘సర్‌’

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

సాక్షి యాదాద్రి : దొంగ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్‌) చేపట్టిందని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన భువనగిరి మున్సిపల్‌ కౌన్సిలర్‌ తుమ్మల యాస్మిన్‌ నగేష్‌ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ‘సర్‌’ పై మజ్లిస్‌ లాంటి పార్టీలు ప్రజల్లో అనవసరమైన అపోహలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలను పరిశీలిస్తే పాతబస్తీలో కొన్ని ఇళ్లల్లో వ్యక్తులు లేకపోయినప్పటికీ వంద నుంచి 120మంది పేర్లతో దొంగ ఓట్లు నమోదై ఉన్నాయన్నారు. ఇలాంటి ఓట్లను ‘సర్‌’ ద్వారా ప్రక్షాళన చేస్తారని స్పష్టం చేశారు. దీంతో విదేశీ వ్యక్తులు, ఉగ్రవాద మూలాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే బయటపడే అవకాశం ఉందన్నారు. కొన్ని హింసాత్మక శక్తులు రాజకీయ అండ చూసుకుని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అనవసరంగా అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ‘సర్‌’పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతోందని, ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావడానికి దొంగ ఓట్ల తొలగింపు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌, నాయకులు పోతంశెట్టి రవీందర్‌, నర్లనర్సింగరావు, మాయ దశరథ, చందా మహేందర్‌గుప్తా, రత్నపురం బలరాం, ఉడుత భాస్కర్‌ పాల్గొన్నారు.

ఫ హర్యానా మాజీ గవర్నర్‌

బండారు దత్తాత్రేయ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement