నల్లగొండ : జిల్లాలో కొనసాగుతున్న పైపులైన్ సహజ వాయువు (పీఎన్‌జీ) విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం నల్లగొండలోని తన చాంబర్‌లో పౌర సరఫరాలు, పరిశ్రమలు, పంచాయతీ రాజ్, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ సంక్షోభం కారణంగా వాణిజ్య విభాగంలో ఎల్‌పీజీ లభ్యతపై ప్రభావం పడుతున్నందున, పీఎన్‌జీ సరఫరాను విస్తరించడం అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా పీఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణ పనుల కొనసాగింపునకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా మాదిరిగానే ఇంటింటికీ గ్యాస్ పైప్ లైన్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మెగా సిటీ గ్యాస్ ప్రాజెక్టు వలిగొండ నుంచి నార్కట్‌పల్లి వరకు విస్తరించిందన్నారు. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ట్యాంక్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నార్కట్‌పల్లి నుంచి నల్లగొండ వరకు పైప్‌లైన్ ద్వారా 5 గ్రామాలను కలుపుతూ టాప్ ఆప్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏఎస్పీ రమేష్, పౌరసరపాల శాఖ అధికారి వెంకటేష్, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, పంచాయతీ రాజ్ అధికారి శేఖర్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


