ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వచ్చే విద్యాసంవత్సరంలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు పెంచేందుకుగాను ముందస్తుగా గ్రామాల్లో బడిబాట కార్యక్రమం చేపట్టాం. మండల వ్యాప్తంగా ఇప్పటికే 20 అడ్మిషన్లు అయ్యాయి. ఉదయం పాఠశాల పూర్తికాగానే ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నాం.
– తరి రాములు, ఎంఈఓ, పెద్దవూర
పెద్దవూర : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో విద్యా శాఖ ముందస్తుగా బడిబాట కార్యక్రమం చేపట్టింది. రానున్న 2026–27 విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని మందస్తుగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉపాద్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికి తిరుగుతూ పిల్లలను సర్కారు బడుల్లోకి పంపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. పాఠశాలల్లో చేర్పించేందుకు బడిఈడు పిల్లలను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా బడి బయట ఉన్న డ్రాపౌట్ పిల్లలను తిరిగి బడిబాట పట్టించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
వలస కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి
ఐదేళ్లు నిండిన చిన్నారులను నేరుగా మొదటి తరగతిలో చేర్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వలస కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో మొత్తం సుమారు 1,424 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రాథమిక స్థాయిలోనే ఎక్కువ నమోదు జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ బడులు ప్రైవేటు పాఠశాలలకు పోటీగా రూపుదిద్దుకున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు మెరుగుపడ్డాయి.
ప్రచారం ఇలా..
ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించడంతో పాటు, ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమ బోధన అందుబాటులోకి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, పోషకాహారంతో కూడిన మధ్యహ్న భోజనం వంటి సౌకర్యాలు అందిస్తున్నామని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో మండలస్థాయి అధికారులు ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తున్నారు. జూన్12న పాఠశాలల పున:ప్రారంభమయ్యే నాటికి కనీసం 10–15శాతం అదనపు అడ్మిషన్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు గ్రామాల్లో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సర్కారు బడుల వైపు తల్లిదండ్రులను మళ్లిస్తున్నారు.
విద్యా శాఖ ముందస్తు ‘బడిబాట’
ఫ సర్కారు బడులను బలోపేతం చేయడమే లక్ష్యం
ఫ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్న టీచర్లు
ఫ జిల్లాలో మొత్తం 1,424 పాఠశాలలు
పాఠశాలల వివరాలు
ప్రాథమిక 980
ప్రాథమికోన్నత 185
ఉన్నత 259
విద్యార్థులు 1.38 లక్షలు


