నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు నల్లగొండలోని క్లాక్ టవర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు, అధికారులు హాజరు కావాలని కోరారు.
నిస్వార్థ సేవకుడు.. నర్రా రాఘవరెడ్డి
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
చిట్యాల : పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన నిస్వార్థ సేవకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ బస్‌స్టేజీ వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షపాతిగా అసెంబ్లీలో పాలకులకు తన వాణి వినిపించిన రాఘవరెడ్డి లాంటి నాయకులు నేడు కరువయ్యారన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాఘవరెడ్డి చేసిన ప్రజాసేవ మరువలేనిదన్నారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మల్లు లక్ష్మి, నారి ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, మల్లం మహేష్, పెంజర్ల సైదులు, చింతపల్లి భయ్యన్న, మండల నాయకులు రాచమడ్ల శ్యాంసుందర్, శీలా రాజయ్య, అర్రూరీ శ్రీను, ఐతరాజు నర్సింహ, కల్లూరి కుమారస్వామి, మెట్టు నర్సింహామ, నరేష్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
మాడుగులపల్లి : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం మాడుగులపల్లి మండలం పాములపాడు పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, ల్యాబ్‌ను పరిశీలించి మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు జరిగేలా చూడాలన్నారు. లెప్రసీ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షయ జబ్బు ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించాలన్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన కల్పించాలన్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు, ఉపాధిహామీ పనుల వద్దకు వెళ్లి రైతులకు, కూలీలకు వడదెబ్బ పట్ల అవగాహన కల్పిచి వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ దీప, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ వేణుగోపాల్‌రెడ్డి, డీటీసీఓ కల్యాణ్ చక్రవర్తి, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఎ.సత్యనారాయణ, డాక్టర్ పి.ప్రశాంత్‌బాబు ఉన్నారు.
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్ : విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండలో గురువారం ఆర్టిజన్ కార్మికులు చేపట్టన ధర్నా వద్దకు వెళ్లి మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మెను నిలిపివేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, జిట్టబోయిన లింగస్వామి, గుండ లింగారెడ్డి, పెరిక శేఖర్, వేణుగోపాల్‌రెడ్డి, పెరమాళ్ల మురళి, అద్దంకి వెంకన్న, లతీఫ్, విజయ్, ఉమాదేవి, నాగమణి, రమ్య పాల్గొన్నారు.


