‘మహిళా శక్తి’కి ఇంధనం | - | Sakshi
Sakshi News home page

‘మహిళా శక్తి’కి ఇంధనం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

నల్లగొండ : రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా, వ్యాపార రంగంలోనూ సత్తాచాటేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిర మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు పెట్రోల్‌ బంకులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బంకు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా.. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయింది.

ఎస్‌ఎల్‌బీసీలో రూ.3.50 కోట్లతో తొలి బంకు

నల్లగొండ నియోజకవర్గానికి మంజూరైన పెట్రోల్‌ బంకును జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద మెడికల్‌ కాలేజీని ఆనుకుని 1.20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారంతో సుమారు రూ.3.50 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. దీని నిర్వహణ బాధ్యతలను తీసుకునేందుకు నీలగిరి మహిళా జిల్లా సమైక్య ముందుకు రావడంతో ప్రభుత్వం వారికి భూమిని కేటాయించింది. గతేడాది అక్టోబర్‌ 13న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రధానమైన ఇంధన ట్యాంకర్లను తీసుకొచ్చి భూమిలో అమర్చారు. అయితే ఈ బంకులో కేవలం పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలకే పరిమితం కాకుండా ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈవీ (ఎలక్ట్రిక్‌ వెహికల్‌) చార్జింగ్‌ స్టేషన్లను కూడా అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకుండా, స్థానిక మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయాల కోసం, ఇతర వ్యాపారాల కోసం ఇక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

మిగతా ఐదు చోట్లా సర్వం సిద్ధం

మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో బంకుల ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేసి, డీఆర్‌డీఓకు నివేదికలు అందజేశారు. ఈ ఐదు బంకుల ఏర్పాటుకు భారత్‌ పెట్రోలియం కంపెనీ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆ సంస్థ అధికారులు సేకరించిన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ ఐదు బంకుల పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

మహిళా సమాఖ్యలకు పెట్రోల్‌ బంకుల నిర్వహణ బాధ్యతలు

ఫ నల్లగొండ జిల్లాకు ఆరు బంకులు మంజూరు

ఫ ఎస్‌ఎల్‌బీసీ వద్ద ముమ్మరంగా బంకు నిర్మాణ పనులు

ఫ మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో పూర్తయిన భూసేకరణ

మిగతా బంకులు ఏర్పాటయ్యే ప్రాంతాలు ఇవే..

నియోజకవర్గం గ్రామం

మిర్యాలగూడ తడకమళ్ల

నాగార్జునసాగర్‌ కొత్తపల్లి (అనుముల)

దేవరకొండ దేవరకొండ పట్టణం

నకిరేకల్‌ కట్టంగూర్‌

మునుగోడు ఉడతలపల్లి (చండూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement