ఫాంపాండ్‌లో మునిగి విద్యార్థి మృతి
● మైనార్టీ గురుకుల పాఠశాల సిబ్బంది
నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
● భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
భువనగిరిటౌన్: మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి వసతి గృహం సమీపంలోని ఫాంపాండ్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి అందులో మునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన ఆంథోనిరాజు, దీపారాణి దంపతుల కుమారుడు బాలఆకాష్(16), మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం పాఠశాల వసతి గృహం నుంచి వారిద్దరు బయటకు వెళ్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఫాంపాండ్‌లో స్నానం చేసేందుకు దిగారు. లోతు అంచనా వేయలేక, ఈత రాకపోవడంతో బాలఆకాష్ ఫాంపాండ్‌లో మునిగిపోయాడు. మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ వెంటనే పాఠశాలకు వచ్చిన సిబ్బందికి విషయం చెప్పాడు. సిబ్బంది వెళ్లేసరికి అప్పటికే బాలఆకాష్ మృతిచెందాడు. మృతదేహాన్ని ఫాంపాండ్ నుంచి బయటకు తీసి భువనగిరి ఏరియా ఆస్పత్రిక తరలించారు. మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ అస్వస్థతకు లోనుకావడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పరీక్ష రాసి వస్తాడనుకున్నాం..
తమ కుమారుడు బాలఆకాష్ మరికొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వస్తాడని అనుకున్నామని.. కానీ ఇలా విగతజీవిగా ఇంటికి తీసుకెళ్తామని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని బాలఆకాష్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు పోస్టుమార్టం చేయకూడదని పట్టుబట్టారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
జీఓ సవరించకుండా రేషనలైజేషన్ సరికాదు
సూర్యాపేటటౌన్ : జీఓ నంబర్ 25ను సవరించకుండా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేయడం సరికాదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్‌రావు అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 60మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటం శాసీ్త్రయం కాదని, ప్రభుత్వం రకరకాల జీఓలతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చూస్తోందని అన్నారు. విద్యారంగంలోకి కార్పొరేట్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడానికి గల కారణాలను శాసీ్త్రయంగా విశ్లేషణ చేయాలని, విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని, ప్రతి గ్రామంలో పాఠశాలలతో పాటు ప్రతి తరగతికి ఒక గది, ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు ఉండేలాగా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ శాఖను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డేగల జనార్దన్, అధ్యక్షుడిగా పబ్బతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల వీరన్న, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా యోగానంద చారిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి రవిచంద్ర, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్. వెంకటేశ్వర్లు, టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రామ నరసయ్య, వీరయ్య, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. వేణు తదితరులు పాల్గొన్నారు.
ఫాంపాండ్‌లో మునిగి విద్యార్థి మృతి


